Afghanistan: పాస్ పోర్టులు జారీ చేయాలని తాలిబన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- నిన్న జరిగిన మినిస్టర్స్ కౌన్సిల్ లో నిర్ణయం
- రోజుకు 5 వేల నుంచి 6 వేల వరకు పాస్ పోర్టుల జారీ
- ప్రాథమిక పరిశీలన దశలో ఉన్న లక్ష పాస్ పోర్టులు
తమ దేశ పౌరులకు పాస్ పోర్టులను జారీ చేయాలని ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిన్న నిర్వహించిన కౌన్సిల్ మినిస్టర్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ సమావేశంలో నిర్ణయించారు. పాస్ పోర్టుతో పాటు తజ్కిరా (జాతీయ ఐడీ కార్డు) కూడా జారీ చేస్తామని ఆయన తెలిపారు.
రోజుకు 5 వేల నుంచి 6 వేల వరకు పాస్ పోర్టులు జారీ చేస్తామని పాస్ పోర్టు కార్యాలయం హెడ్ అలామ్ గుల్ హక్కానీ చెప్పారు. కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు, మహిళలకు సంబంధించిన పాస్ పోర్ట్ వ్యవహారాలు చూస్తారని తెలిపారు. మరోవైపు అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్తి మాట్లాడుతూ... లక్ష పాస్ పోర్టులు ప్రాథమిక దశలో పరిశీలనలో ఉన్నాయని, 25 వేల పాస్ పోర్టులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఆగస్ట్ 15న ఆఫ్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి పాస్ పోర్టుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.