Aryan Khan: క్రూయిజ్ నౌకలో ఎన్‌సీబీ చేసిన దాడులు నకిలీవి: 'మహా' మంత్రి నవాబ్ మాలిక్
- ఆర్యన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు
- షారుఖ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు నెల క్రితమే సమాచారం
- ఈ ఘటన వెనక బీజేపీ హస్తం ఉంది
- ఎన్‌సీబీ అధికారులతో ఉన్న వారెవరో బీజేపీ చెప్పాలని డిమాండ్
ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో ఇటీవల జరిపిన దాడిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడినట్టు ఎన్‌సీబీ ప్రకటించింది. ఈ ఘటనలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా 8 మంది అరెస్టయ్యారు. సిటీ కోర్టు వీరిని రేపటి వరకు ఎన్‌సీబీ కస్టడీకి అప్పగించింది.
ఇదిలా ఉండగా, తాజాగా మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. క్రూయిజ్ నౌకలో ఎన్‌సీబీ చేసిన దాడులు నకిలీవన్నారు. అసలక్కడ డ్రగ్సే దొరకలేదన్నారు. షారుఖ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు నెలక్రితమే తమకు సమాచారం అందిందన్నారు. క్రైం రిపోర్టర్ల గ్రూపులో ఈ విషయం చక్కర్లు కొట్టిందన్నారు.
క్రూయిజ్ నౌకలో ఎన్‌సీబీ దాడి సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని, వారిలో ఒకరు బీజేపీ నేత అని ఆరోపించారు. ఆర్యన్ అరెస్ట్ అక్రమమన్న ఆయన.. దీని వెనక బీజేపీ కార్యకర్తల హస్తం ఉందన్నారు. సోదాల సమయంలో ఉన్న కేపీ గోసావి, మనీశ్ భానుషాలి ఎవరు? వారక్కడ ఎందుకు ఉన్నారో బీజేపీ, ఎన్‌సీబీ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. వీరితో బీజేపీ నేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఎన్‌సీబీని వాడుకుంటూ మహారాష్ట్రపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.