Nagababu: అలాంటప్పుడు ప్రకాశ్ రాజ్ ని నాన్ లోకల్ అని ఎలా అంటారు?: నాగబాబు
- సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాశ్ రాజ్
- కోట్లను కాదనుకుని అసోసియేషన్ కు సేవ చేసేందుకు వచ్చారు
- చిన్న, పెద్ద సినిమాలన్నింటికీ ఆయనే కావాలి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రకాశ్ ప్యానల్ కు చెందిన నాగబాబు మాట్లాడుతూ... ప్రకాశ్ రాజ్ ను తెలుగువాడు కాదని అంటున్నారని... ఆయన భారతీయ నటుడని, అన్ని భాషల్లో నటించారని చెప్పారు. చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు అన్నిటికీ ప్రకాశ్ రాజ్ కావాలని... అలాంటప్పుడు ఆయనను నాన్ లోకల్ అని ఎలా అంటారని ప్రశ్నించారు.
ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాశ్ రాజ్ అని... ఎన్నో కోట్లను కాదనుకుని 'మా'కు సేవచేయడానికి వచ్చారని కొనియాడారు. కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ వంటి వారు ప్రకాశ్ రాజ్ ఎవరని అడుగుతున్నారని... వాళ్లు ఇతర భాషల్లో నటించలేదా? అని నాగబాబు ప్రశ్నించారు. అసోసియేషన్ కు సేవ చేసేందుకు వచ్చిన వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటం సరికాదని అన్నారు.
అసోసియేషన్ ఎన్నికల్లో డబ్బు ఆశ చూపుతున్నారని... ఒక్కో ఓటుకు రూ. 10 వేలు ఇస్తున్నారని... కొన్ని రోజుల తర్వాత ఇంకొంత నగదు ఇస్తామని చెపుతున్నారని నాగబాబు విమర్శించారు. మంచు విష్ణు గెలుపును కొందరు వ్యక్తులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని... ఆయనను గెలిపించాలనే కంగారు వాళ్లకు ఎందుకని ప్రశ్నించారు.