NCB: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను ఖండించిన ఎన్‌సీబీ
- ఎన్‌సీబీ దాడులు నకిలీవన్న మంత్రి నవాబ్ మాలిక్
- ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా కనిపిస్తున్నాయన్న ఎన్‌సీబీ
- పూర్తిగా నిరాధార ఆరోపణలన్న దర్యాప్తు సంస్థ
ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై ఇటీవల దాడి చేసిన ఎన్‌సీబీ అధికారులు పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతోపాటు బాలీవుడ్ బిగ్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. కోర్టు వీరిని రేపటి (గురువారం) వరకు ఎన్‌సీబీ కస్టడీకి అప్పగించింది.
కాగా, ఎన్‌సీబీ దాడిపై తాజాగా స్పందించిన ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీబీ చేసిన దాడులు నకిలీవని, ఈ వ్యవహారంలో బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. దాడి సమయంలో అధికారులతో పాటు బీజేపీ నేత కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు.
నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలపై తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పందించింది. మంత్రి వ్యాఖ్యలను కొట్టిపడేసింది. మంత్రి వ్యాఖ్యలు ద్వేషపూరితంగా, పక్షపాతంతో కూడుకున్నట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. నవాబ్ మాలిక్ అల్లుడు డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని పేర్కొంది. మంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి చెప్పింది.