Tirumala: ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి వాహన సేవలు
- అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
- నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ
- 11న పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
దేవదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. సాయంత్రం ఆరు గంటలకు రంగనాయకుల మండపంలో సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు. బ్రహ్మోత్సవాలు కొనసాగిన రోజుల్లో యజ్ఞం కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా ఏకాంతంగానే ఉత్సవాలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళ్లలో వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 8.30 గంటల నుంచి గంటపాటు పెద్దశేషవాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.