Pakistan: పాకిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం.. 20 మంది మృతి
- రిక్టర్ స్కేలుపై 5.7గా తీవ్రత నమోదు
- భవనాలు కూలి మీద పడడంతోనే మరణాలు
- మృతుల్లో మహిళ సహా ఆరుగురు చిన్నారులు
- సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు పంపిస్తున్న ప్రభుత్వం
పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ప్రజలు మంచి నిద్రలో ఉన్న సమయంలో దక్షిణ పాకిస్థాన్‌లో ఈ ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చాలామంది భవనం పైకప్పు, గోడలు కూలి మీదపడడం వల్లే మరణించారు.
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైందని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో క్షతగాత్రులకు ఫ్లాష్‌లైట్లు ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నారు.
భూ ప్రకంపన కారణంగా పర్వత నగరం హర్నాయిలో తీవ్ర నష్టం సంభవించింది. ఇక్కడ రోడ్డు, విద్యుత్, మొబైల్ సౌకర్యం అంతగా లేకపోవడంతో బాధితులను రక్షించడం రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. భూకంపం కారణంగా 20 మంది వరకు చనిపోయినట్టు తమకు సమాచారం అందిందని బలూచిస్థాన్ హోమంత్రి మిర్ జియా ఉల్లా లాంగౌ తెలిపారు. మృతుల్లో మహిళ సహా ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లను పంపిస్తున్నట్టు ప్రావిన్షియల్ సీనియర్ అధికారి సుహైల్ అన్వర్ హష్మి తెలిపారు.