RCB: ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి.. బెంగళూరుకు హైదరాబాద్ గండం!
- నిన్న 4 పరుగులతో గెలిచిన ఎస్ఆర్హెచ్
- రెండోస్థానానికి వెళ్లకుండా అడ్డగింత
- గత మ్యాచ్ లలోనూ కొరకరాని కొయ్యలా హైదరాబాద్
ఐపీఎల్ 14వ సీజన్ లో ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్).. కింగ్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను మట్టికరిపించి ఊరట విజయాన్నందుకుంది.
అయితే, చివరి నిమిషాల్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఆర్సీబీకి ఓడిపోవడం పరిపాటిగానే మారిపోయింది. ఇప్పుడంటే ఆర్సీబీ ఆల్రెడీ ప్లే ఆఫ్స్ లోకి ఎంటరైందిగానీ.. కొన్ని సార్లు ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలనూ హైదరాబాద్ ఆవిరి చేసి షాక్ లమీద షాకులిచ్చింది. ఇప్పటిదాకా 19 సార్లు రెండు జట్లు పోటీ పడ్డాయి. అందులో 10 మ్యాచ్ లలో హైదరాబాద్ గెలువగా.. 8 ఆర్సీబీ గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
- 2009లో తొలిసారిగా ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన డెక్కన్ చార్జర్స్ (హైదరాబాద్ పాత ప్రాంచైజీ).. ఆర్సీబీతో పోటీ పడింది. ఆ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో గెలిచి కప్పును ఎగురేసుకెళ్లింది. బెంగళూరుకు ఫస్ట్ షాక్ ఇచ్చింది.
- 2012లో తన చివరి లీగ్ మ్యాచ్ ను డెక్కన్ చార్జర్స్ తో ఆర్సీబీ ఆడింది. ఆ మ్యాచ్ లోనూ ఓటమి పాలైంది. దీంతో నెట్ రన్ రేట్ లో స్వల్ప తేడాతో ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ దూరమైంది. సమాన పాయింట్లతో ఉన్నా నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న చెన్నై నాలుగో స్థానానికి వెళ్లింది.
- 2013 సీజన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ గా డీసీ మారింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ సందర్భంగా బెంగళూరును ఓడించిన ఎస్ఆర్హెచ్.. ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు జల్లింది. ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.
- 2016 ఫైనల్స్ లో రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లోనూ గెలిచిన ఎస్ఆర్హెచ్.. ఆర్సీబీకి రెండోసారి కప్పు ఆశలకు గండి కొట్టింది.
- 2020 ప్లేఆఫ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీని ఎస్ఆర్హెచ్ మట్టికరిపించింది.
- నిన్న జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరుకు హైదరాబాద్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిచి రెండో స్థానంలో నిలుద్దామనుకున్న బెంగళూరు ఆశలను ఆవిరి చేసింది. 4 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్.. ఆర్సీబీని మూడో స్థానానికే పరిమితం చేసింది.