Justice N.V. Ramana: లఖింపూర్ ఖేరి ఘటనపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం.. ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఆదేశం
- రేపటిలోగా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని యూపీ సర్కార్ కు ఆదేశం
- విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ కు మెసేజ్
- ఘటనలో రైతు మృతి.. అతడి తల్లికి సీరియస్
- ఆమె ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని ఆదేశం
లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు రోజుల క్రితం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని కార్ ఒకటి రైతులపైకి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్, ఓ జర్నలిస్టును కొందరు రైతులు కొట్టి చంపారు.
రైతులు చనిపోయిన ఘటనపై శివకుమార్ త్రిపాఠి అనే న్యాయవాది.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడంతో ఇవాళ ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రేపటిలోగా ఘటనపై దర్యాప్తు స్థితిని తెలియజేస్తూ నివేదికను సమర్పించాలని సీజేఐ జస్టిస్ రమణ ఆదేశించారు. చనిపోయిన 8 మంది ఎవరు? వారి వివరాలేంటి? స్పష్టంగా చెప్పాలన్నారు. ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వివరించాలన్నారు.
అయితే, ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దీనిపై స్పందించిన సీజేఐ.. అసలు ఎఫ్ఐఆర్ లే సరిగ్గా లేవని, దర్యాప్తు సరైన క్రమంలో సాగట్లేదన్నదే పిటిషనర్ ఆందోళన అని అన్నారు. ఘటనలో ఓ రైతు చనిపోయాడని, అతడి తల్లి ఆసుపత్రిలో ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతోందంటూ కోర్టు విచారణ సందర్భంగా మెసేజ్ వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆమె వైద్య ఖర్చులన్నీ యూపీ ప్రభుత్వమే భరించాలని ఆదేశించారు.