Jammu And Kashmir: స్కూల్ లోకి చొరబడి టీచర్లను కాల్చి చంపిన ఉగ్రవాదులు
- జమ్మూకశ్మీర్ లో దారుణం
- ప్రిన్సిపాల్, టీచర్ దుర్మరణం
- సామాన్యులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు
- ఇటీవలి కాలంలో పెరిగిన ఘటనలు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని చంపేస్తున్నారు. ఇవాళ ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని కాల్చి చంపారు. చనిపోయిన వారిని ప్రిన్సిపాల్ సూపీందర్ కౌర్ (44), దీపక్ చాంద్ లుగా గుర్తించారు. ఈ ఘటన శ్రీనగర్ లోని ఈద్గా ప్రభుత్వ బాలుర పాఠశాలలో జరిగింది. వారిద్దరూ అలోచిబాగ్ కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని శౌరాలోని స్కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
శ్రీనగర్ లోని ఓ మెడికల్ షాపు యజమానిని కాల్చి చంపిన రెండు రోజులకే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఇది అమానవీయ చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
సామాన్యులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 23 మందిని ఉగ్రవాదులు చంపేశారు. శ్రీనగర్ లో 10 మందిని, పుల్వామాలో నలుగురిని, అనంత్ నాగ్ లో నలుగురిని, కుల్గాంలో ముగ్గురిని, బారాముల్లాలో ఇద్దరిని, బుద్గాం, బందీపురాలో ఒక్కొక్కరిని ఉగ్రవాదులు చంపారు.