Nagababu: 'మా' ఎన్నికల్లో చిరంజీవి మద్దతు ఎవరికో చెప్పిన నాగబాబు
- మరింత రంజుగా 'మా' ఎన్నికలు
- మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్ వెనుకే ఉంటుందన్న నాగబాబు
- తమ నిర్ణయంలో మార్పు లేదని వెల్లడి
- ప్రత్యర్థి ప్యానెల్ దుష్ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడిగా సాగుతోంది. మరో మూడ్రోజుల్లో ఎన్నికలు జరగనుండగా, మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా కుటుంబం మద్దతు ఎవరికో వెల్లడించారు. చిరంజీవితో సహా తమ కుటుంబంలోని అందరు నటులు ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మొదట్లో మద్దతు ఇచ్చారని, ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోందని, అది తప్పు అని నాగబాబు స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లోకి జీవిత రావడంతో మెగా కుటుంబం మనసు మార్చుకుందంటూ పుకార్లు పుట్టించారని వెల్లడించారు. జీవితతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.
ఓడిపోతామన్న భయంతోనే ప్రత్యర్థి ప్యానెల్ వాళ్లు ఇలాంటి దుష్ప్రచారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. తాము మడమతిప్పేది లేదని ఉద్ఘాటించారు. అన్నయ్య మద్దతు ప్రకాశ్ రాజ్ కేనని, 'మా' అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ అర్హుడని భావిస్తున్నామని తెలిపారు. ఎవర్ని తన ప్యానెల్లో చేర్చుకుంటున్నారనే విషయంలో ప్రకాశ్ రాజ్ కు స్వేచ్ఛ ఉంటుందని నాగబాబు పేర్కొన్నారు.
ఇక, 'మా' ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే అంశాలను తీసుకురావడం సబబు కాదని హితవు పలికారు. ఎవరు ఎక్కడ్నించైనా, దేనికైనా పోటీ చేయొచ్చని, మనది ప్రజాస్వామిక దేశం అని వివరించారు. కమలా హారిస్ అమెరికాలో ఉపాధ్యక్షురాలు కాలేదా? ప్రకాశ్ రాజ్ అనర్హుడు అని చెప్పడానికి ఒక్క కారణం చెప్పండి? అని నిలదీశారు.