Hyderabad: అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి శునకాలను ఉసిగొల్పిన నిందితులు
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘటన
- కత్తి చూపించి ఇంటి వెనక నుంచి పారిపోయిన నిందితులు
- వెంబడించి పట్టుకున్న పోలీసులు
ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి శునకాలను ఉసిగొల్పిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల ఆరో తేదీన బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో ఉండే సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రి (75) ఇంట్లోకి మరో 20 మందితో కలిసి ప్రవేశించిన ఆరిఫ్ మొయినుద్దీన్ కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.
ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులు జూబ్లిహిల్స్‌లోని రోడ్ నంబరు 86లోని ఓ ఇంట్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా ఆరిఫ్ కుటుంబ సభ్యులు వారిపైకి శునకాలను ఉసిగొల్పారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో మరికొంతమందిని పంపించారు.
అయినప్పటికీ వారిని అడ్డుకున్న నిందితులు కత్తి చూపించి తమను తాము గాయపరుచుకుంటామంటూ బెదిరించి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. లోపలి నుంచి వాటర్ బాటిళ్లను పోలీసులపైకి విసిరారు. అనంతరం ఇంటి వెనక నుంచి పరారయ్యారు.
వెంబడించిన పోలీసులు ప్రధాన నిందితుడు ఆరిఫ్‌తోపాటు అతడికి సహకరించిన జబీనా (30), షబానా బేగం (25)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, శునకాలను ఉసిగొల్పి విధులకు ఆటంకం కలిగించినందుకు నిందితులపై మరో కేసు కూడా నమోదైంది.