Teenmaar Mallanna: రెండు రోజుల విచారణ కోసం పోలీసు కస్టడీకి తీన్మార్ మల్లన్న
- కల్లు ముస్తేదారు నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేసి రూ. 5 లక్షలు వసూలు
- ఎ-5 నిందితుడిగా తీన్మార్ మల్లన్న
- కోర్టు అనుమతితో చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేటలో కల్లు ముస్తేదారు జయవర్ధన్ గౌడ్ నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేసి రూ. 5 లక్షలు వసూలు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తీన్మార్ మల్లన్నను కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో తీన్మార్ మల్లన్న ఎ-5 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు 15 రోజుల క్రితం బోధన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అయితే, ఈ కేసులో ఆయనను మరింత విచారించాల్సి ఉందని, కాబట్టి తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని పోలీసులు అభ్యర్థించారు. కోర్టు అనుమతినివ్వడంతో హైదరాబాద్ చేరుకున్న నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్నను తీసుకెళ్లారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లన్నకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.