Huzurabad: నేటితో ముగియనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు
- 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ
- ఈ నెల 30న పోలింగ్, నవంబరు 2న ఫలితాలు
- టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ!
తెలంగాణ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 1న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా, నవంబరు 2న ఓట్లను లెక్కిస్తారు. కాగా, నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా, 11న పరిశీలిస్తారు. 13న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీపడుతుండగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు)ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఎన్నికల్లో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.