Maharashtra: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చక్కెర కర్మాగారాలపై ఐటీ దాడులు
- అజిత్ పవార్ తోబుట్టువుల ఇళ్లపైనా దాడులు
- గతంలో జరందేశ్వర్ చక్కెర ఫ్యాక్టరీపై దాడులు
- లఖింపూర్ ఖేరి ఘటనపై మాట్లాడడం వల్లనేనన్న శరద్ పవార్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ చక్కెర కర్మాగారాలపై నిన్న ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే, ఆయన తోబుట్టువుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేపట్టారు. పూణెలో ఉంటున్న అజిత్ పవార్ సోదరి నీతా పాటిల్ ఇంటితోపాటు కొల్హాపూర్‌లో ఉంటున్న మరో సోదరి విజయా పాటిల్ ఇల్లు, వారు నిర్వహిస్తున్న ముక్తా పబ్లికేషన్ హౌస్‌లలో అధికారులు తనిఖీలు చేశారు.
ఈ తనిఖీలపై స్పందించిన ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్.. లఖింపూర్ ఖేరి ఘటనపై తాను మాట్లాడడం వల్లే అజిత్ తోబుట్టువుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. కాగా, సతారాలో అజిత్ పవార్‌కు ఉన్న జరందేశ్వర్ చక్కెర మిల్లుపైనా జులైలో దాడులు జరిగాయి. ఈ సందర్భంగా రూ. 65 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేశారు.