Pawan Kalyan: ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను మరిచిపోయేలా చేశారు: వైసీపీ సర్కారుపై పవన్ కల్యాణ్ విమర్శలు

Pawan Kalyan slams YCP Govt on salaries and pensions
  • జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించడంలేదని ఆరోపణ
  • మానసిక వేదనకు గురిచేస్తున్నారని వ్యాఖ్యలు
  • సర్కారుకు ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శలు
  • అప్పులు ఏమైపోతున్నాయంటూ ఆగ్రహం
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో అందించడం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు, ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను ప్రభుత్వ ఉద్యోగులు మరచిపోయేలా చేశారని వైసీపీ సర్కారును విమర్శించారు. జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని, ఈ అనిశ్చితి ఏపీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందకపోవడం బాధాకరమని అన్నారు. దశాబ్దాల పాటు ఉద్యోగ సేవలు అందించి విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటారని తెలిపారు. వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, ఆ ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారమని పవన్ చెప్పారు. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే వారు ఎంతో మానసిక వేదనకు గురవుతారని అభిప్రాయపడ్డారు.

తన తండ్రి కూడా ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైరయ్యారని, ఆయన ఎంత ఆత్మాభిమానంతో ఉండేవారో తాను చూశానని, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీతం మీద, పెన్షన్ మీద ఎంతో ఆత్మాభిమానంతో జీవిస్తారని వివరించారు. నిర్దేశిత సమయానికి ఆ డబ్బు చేతికి అందకపోతే ఎంతకాలం వారు చేబదుళ్లతో నెట్టుకురావాలి? అని ప్రశ్నించారు.

నిరంతరం ఉద్యోగ విధుల్లో ఉండే పోలీసులకు గడచిన 11 నెలలుగా టి.ఏ కూడా లభించడంలేదని పవన్ వెల్లడించారు. పోలీసుల ఇబ్బందులు తన దృష్టికి వచ్చినందునే అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రభుత్వం 7 డి.ఏలు బకాయి పడిందని, పీఆర్సీ కూడా అమలు చేయడంలేదని ఆరోపించారు. జీతం ఇవ్వడం ఆలస్యం చేస్తే డి.ఏ, టి.ఏ, పీఆర్సీ అడగరని, జీతం ఇస్తే అదే పదివేలు అని ఉద్యోగులు భావిస్తారని ప్రభుత్వం అనుకుంటోందని పవన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి నెలసరి ఆదాయం గతేడాది కంటే పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయని, మరి ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు కూడా చేయడంలేదంటే ఆ ఆదాయం ఎటుపోతోందని ప్రశ్నించారు. ప్రతి నెలా తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని నిలదీశారు.
Pawan Kalyan
YCP Govt
Salaries
Pensions
Andhra Pradesh

More Telugu News