Chinta Mohan: ఉద్యోగులకు జీతాలు ఇవ్వవయ్యా స్వామీ!: కాంగ్రెస్ నేత చింతా మోహన్

Chinta Mohan responds to salaries issues of AP employees
  • తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్
  • వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
  • ఏపీలో ఉద్యోగుల పరిస్థితిపై ఆవేదన
  • వైసీపీ సర్కారుకు అనుభవంలేదని వెల్లడి
ఏపీ సర్కారు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. ఆర్థికమంత్రి అప్పులు శాఖ మంత్రిగా మారారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వవయ్యా స్వామీ... పనిచేసిన వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగ? అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

"జీతాలు, పెన్షన్లు అందనివాళ్లు మాట్లాడుతుంటే అయ్యో అనిపించింది. డబ్బు అందకపోతే వాళ్లేం కావాలి?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపైనా స్పందించారు.

"చెప్పుకోవడానికి మూడు రాజధానులేమిటి, 30 రాజధానుల పేర్లు చెప్పుకోవచ్చు, పేపర్లలో రాయించుకోవచ్చు. కర్నూలులో హైకోర్టు అంటున్నారు. ఎక్కడంటే అక్కడ పెట్టడానికి ఇదేమైనా హైస్కూలా...? ఈ అంశంలో వైసీపీ సర్కారు అనుభవలేమి బయటపడుతోంది. మంత్రులే నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి ఎలా వ్యవహరించాలో తెలియదు. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో జడ్జిలు నిర్ణయించాలి. వైసీపీ మంత్రులు ప్రజలను ఈ అంశంలో మభ్యపెడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయం ఆచరణ సాధ్యం కాదు" అని చింతా మోహన్ పేర్కొన్నారు.
Chinta Mohan
Salaries
Employees
Three Capitals
Andhra Pradesh

More Telugu News