CM KCR: మీకేం చేతకాదన్న ఏపీ నుంచి విడిపోయాం... ఇప్పుడు ఎవరి తలసరి ఆదాయం ఎంతో చూడండి!: సీఎం కేసీఆర్
- అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగం
- నిధులే ఇవ్వకుంటే దారిమళ్లించేది ఎక్కడని వ్యాఖ్యలు
- కేంద్రానికి తెలంగాణనే ఇస్తోందని వెల్లడి
- కొందరు చిల్లర కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశ ఖజానాకు నిధులు సమకూర్చే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని వెల్లడించారు. గతంలో ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు తెలంగాణ వారికి వ్యవసాయం రాదని, తెలివి లేదని అన్నారని, ఇప్పుడు ఎవరి తలసరి ఆదాయం ఎంతుందో చూసుకోవాలన్నారు. ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు అయితే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలు అని వివరించారు. అటు కేంద్రం తలసరి ఆదాయం కంటే తెలంగాణదే ఎక్కువమని, తెలంగాణనే కేంద్రానికి ఇస్తోందని అన్నారు.
నిధులు మళ్లిస్తున్నామని అంటున్నారని, కేంద్రం నుంచి నిధులు వస్తే కదా దారి మళ్లించేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇస్తోందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఇక కట్టిపెట్టాలని హితవు పలికారు. తమ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టినా కొందరు చిల్లర కామెంట్లు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నిధులు మీ జేబులోంచి ఏమైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.