Yogi Adityanath: అందుకే లఖింపూర్ హింస ఘటనలో ఇప్పటివరకు అరెస్టులు చేయలేదు: యూపీ సీఎం యోగి
- స్పష్టమైన ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు
- చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే
- సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది
- లఖింపూర్ ఘటనలో దర్యాప్తు జరుగుతోంది
లఖింపూర్ ఖేరి హింస ఘటనలో ఇప్పటివరకు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. రైతులపై కారు ఎక్కించిన ఘటనపై ఇప్పటికే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినప్పటికీ స్పష్టమైన ఆధారాలు ఇంకా లభ్యం కాలేదని యూపీ సర్కారు అంటోంది.
దీనిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాము ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయబోమని చెప్పుకొచ్చారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తోందని తెలిపారు. లఖింపూర్ ఘటనలో దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
ఇప్పటికే లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. ఎవర్నీ వదిలిపెట్టబోమని చెప్పుకొచ్చారు. తాము ఎవరికీ అన్యాయం చేయబోమన్నారు. విపక్షాలు చేస్తోన్న ఒత్తిడిలో ఎటువంటి చర్యలు చేపట్టబోమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని హితవు పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిగిన తర్వాత అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.