Uttar Pradesh: కారులోగానీ, కాన్వాయ్ లోగానీ నేను లేను.. ఇవిగోండి సాక్ష్యాలు.. పోలీసుల విచారణలో కేంద్ర మంత్రి కుమారుడు
- ఇవాళ విచారణకు హాజరైన ఆశిష్ మిశ్రా
- లఖింపూర్ ఖేరి ఘటనపై వివరణ
- తాను దంగల్ లో ఉన్నానని వెల్లడి
- సాక్ష్యంగా వీడియో, పది మంది వాంగ్మూలాలు
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఇవాళ పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకెళ్లినప్పుడు తాను ఆ కాన్వాయ్ లోగానీ, కారులో గానీ లేనని క్రైం బ్రాంచ్ పోలీసులకు స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను దంగల్ లో ఉన్నానని చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. దాంతో పాటు పది మంది సాక్షుల వాంగ్మూలాలనూ దానికి జత చేశారు. డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలోని సిట్ ఆశిష్ ను విచారించింది.
వాస్తవానికి శుక్రవారం ఉదయమే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. అయితే, అనారోగ్యం కారణంగా రాలేకపోయారని అజయ్ మిశ్రా వివరణ ఇచ్చారు. దీంతో అధికారులు తాజా సమన్లు ఇవ్వడంతో ఆయన విచారణకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు.