Assom: మాకు ‘మియా’ల ఓట్లు అవసరం లేదు: అసోం సీఎం
- సామరస్యంగా బతుకుతున్నామన్న హిమంత బిశ్వశర్మ
- వలస ముస్లింలు ఎక్కువ మందిని కంటున్నారు
- వెయ్యి మందే 77 వేల ఎకరాలను ఆక్రమించారా?
బెంగాల్ నుంచి అసోంలోకి వచ్చిన మియా ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. ‘‘నాకు మియాల ఓట్లు వద్దు. మేం సామరస్యంతో బతుకుతున్నాం. ఓట్ల కోసం వారి దగ్గరకు నేను వెళ్లను. వారూ నా దగ్గరకు రారు’’ అని చెప్పారు. వలస వచ్చిన ముస్లింల వల్లే అసోం తన ఉనికి, సంస్కృతి, భూమిని కోల్పోయిందని చాలా మంది భావిస్తున్నారన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మత రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. వలస ముస్లింలు ఎక్కువ మందిని కంటున్నారని, దాని వల్ల ఎక్కువగా భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందే ఇది ప్రారంభమైందని అస్సామీలు నమ్ముతున్నారని, తానూ ఆ భారాన్ని మోస్తున్నానని తెలిపారు. తాము ఎవరి మీదా ద్వేషం చూపించట్లేదన్నారు.
77 వేల ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటినే తొలగించామని చెప్పారు. కేవలం వెయ్యి కుటుంబాలే అంత భూమిని ఆక్రమించాయా? అని ప్రశ్నించారు. భూమి లేని రాష్ట్ర ప్రజలకు భూములు ఇవ్వాల్సి ఉందని, అందుకే వారిని ఖాళీ చేయించామని చెప్పారు. ఖాళీ చేయించడం నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. ప్రియాంక గది ఊడ్చిన విషయంపై స్పందించిన ఆయన.. అదేమంత పెద్ద విషయం కాదన్నారు. తన తల్లి కూడా ఇల్లు ఊడ్చేదన్నారు. మామూలు జనం ఎవరూ పెద్దగా దానిని పట్టించుకోరన్నారు. ఆమె ఊడ్చే విధానమూ కరెక్ట్ కాదని చెప్పారు.