Vijayashanti: ఓవైపు ధనిక రాష్ట్రం అంటున్నారు, మరోవైపు పేదల సంఖ్య పెరిగిపోతోంది... ఇదెలాగో ప్రభుత్వం వెల్లడించాలి: విజయశాంతి

Vijayasanthi slams Telangana govt

  • టీఆర్ఎస్ సర్కారుపై విజయశాంతి విమర్శలు
  • తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అవుతుందన్న బీజేపీ నేత
  • గత ఏడేళ్లలో పేదల సంఖ్య పెరిగిందని వెల్లడి
  • రాష్ట్రంలో 71 శాతానికి పైగా పేదలేనని వివరణ
  • కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు

తెలంగాణ సర్కారుపై బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుండడంపై ఆమె స్పందించారు. ఓవైపు మనది ధనికరాష్ట్రం అని సర్కారు గొప్పలు చెప్పుకుంటోందని, అదే సమయంలో రాష్ట్రంలో పేదల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, ఇదెలాగో ప్రభుత్వం వెల్లడించాలని స్పష్టం చేశారు.

జీఎస్ డీపీలో దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉందని, సర్ ప్లస్ స్టేట్ అని ఆర్థికశాఖ చెబుతోందని, కానీ అదే సమయంలో పౌరసరఫరాల శాఖ జారీ చేసే రేషన్ కార్డులకు పొంతన కుదరడంలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.

గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల వివరాలు ప్రకటించడం చూస్తుంటే గత ఏడేళ్లలో రాష్ట్రంలో పేదల సంఖ్య ఎక్కువైనట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 71 శాతానికి పైగా పేదరికంలో మగ్గుతున్నట్టు వెల్లడైందని తెలిపారు. అలాంటప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశాభివృద్ధికి తామే నిధులు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గారడీ మాటలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.

కేసీఆర్ ధనిక తెలంగాణ అప్పుల లెక్క గతంలో రూ.70 వేల కోట్లు ఉంటే, ఇప్పుడది రూ.4 లక్షల కోట్లకు చేరిందని ఎద్దేవా చేశారు. గడచిన 5 నెలల్లోనే రూ.6,800 కోట్ల మిత్తి కడుతున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రం అంటూనే ప్రజలను దారిద్ర్యరేఖకు దిగువన పడేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రగతి కోసం చేస్తున్నది శూన్యమని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని, వచ్చే ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని విజయశాంతి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News