Janasena: బద్వేలు ఉప ఎన్నికపై జనసేన కీలక నిర్ణయం... బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం

Janasena decides to extend support for BJP candidate in Budvel by elections

  • అక్టోబరు 30న బద్వేలు ఉప ఎన్నిక
  • తాము పోటీ చేయడంలేదని జనసేన స్పష్టీకరణ
  • తమ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
  • బీజేపీ తమ మిత్రపక్షమన్న నాదెండ్ల 
  • పొత్తు ధర్మం ప్రకారం మద్దతిస్తామని వెల్లడి

బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడంలేదని ఇప్పటికే ప్రకటించిన జనసేన పార్టీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామ్య పక్షం అయిన బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బీజేపీ, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ అదే విధంగా ముందుకెళతామని స్పష్టం చేశారు.

"బద్వేలు ఉప ఎన్నికలో మేం అభ్యర్థిని నిలపడంలేదు. సిద్ధాంతపరమైన నిర్ణయం ఇది. మా పార్టీ అధ్యక్షుడు దీనిపై స్పష్టంగా చెప్పారు. అయితే, మా మిత్ర పక్షం బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టింది కాబట్టి ప్రచారంలో పాల్గొనడం మా ధర్మం. తప్పకుండా మద్దతిస్తాం" అని నాదెండ్ల వివరణ ఇచ్చారు.

కాగా, తమ అభ్యర్థికి జనసేన మద్దతు ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పణతాల సురేశ్ కు మద్దతుగా జనసైనికులు పనిచేస్తారని తమ మిత్రపక్షం జనసేన ప్రకటించిందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కూడా జనసేన నేతలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

  • Loading...

More Telugu News