Crocodile: మూసీ నదిలో మొసలి... హడలిపోతున్న స్థానికులు!
- హైదరాబాదులో భారీ వర్షం
- ఉప్పొంగుతున్న మూసీ
- ఎగువ ప్రాంతాల నుంచి వరద
- వరద నీటికి కొట్టుకొచ్చిన మొసలి
- అత్తాపూర్ వద్ద ప్రత్యక్షం
గత కొన్నిరోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నిన్న కూడా హైదరాబాదును కుండపోత వాన ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది సైతం పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో హైదరాబాదు శివార్లలోని అత్తాపూర్ వద్ద మూసీ నదిలో ఓ మొసలి దర్శనమిచ్చింది.
ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటితో పాటు ఈ మొసలి కూడా కొట్టుకుని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మూసీ నదిలో ఓ బండపై విశ్రాంతి తీసుకుంటున్న మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అటు, కిస్మత్ పురాలో రెండు మొసళ్లు చనిపోయినట్టు గుర్తించారు. వీటిపై వారు జంతు ప్రదర్శనశాల అధికారులకు సమాచారమిచ్చారు.
కాగా, నేడు కూడా హైదరాబాదులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.