Chandrasekhar Gowda: 18 ఏళ్లుగా అడవిలోనే... కర్ణాటక వ్యక్తి వింత గాథ!
- అడవిలో పాక... పాక కింద ఫియట్ కారు
- ఫియట్ కారునే ఆవాసంగా మార్చుకున్న చంద్రశేఖర్ గౌడ
- గతంలో గౌడ భూమిని వేలం వేసిన సహకార సొసైటీ
- 2003 నుంచి అడవి ఒడిలో జీవనం
కర్ణాటకకు చెందిన చంద్రశేఖర్ గౌడది ఓ విచిత్ర గాథ. ఆయన వయసు 48 ఏళ్లు. దక్షిణ కర్ణాటక ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ గౌడ గత 18 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా నివసిస్తున్నాడు. ఓ చిన్న పాక వంటి నిర్మాణంలో భద్రంగా నిలిపి ఉంచిన ఫియట్ కారులో చంద్రశేఖర్ గౌడ జీవిస్తుండడం విస్మయం కలిగించే అంశం. అందుకు దారితీసిన పరిస్థితులు ఎంతో ఆసక్తికరం.
గతంలో అరంతోడ్ ప్రాంతంలో నివసించే గౌడ 1999లో స్థానిక కోఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.54 వేలు రుణం తీసుకున్నాడు. అయితే రుణం సకాలంలో చెల్లించలేదంటూ అతడికి చెందిన 2.29 ఎకరాల భూమిని సదరు సొసైటీ 2002లో వేలం వేసింది. ఆ భూమి అప్పట్లో రూ.1.2 లక్షలకు అమ్ముడైంది. గౌడ చెల్లించాల్సిన సొమ్మును రుణానికి మినహాయించిన సొసైటీ, మిగతా సొమ్మును భద్రంగా ఉంచింది. అయితే, ఆ డబ్బును గౌడ స్వీకరించలేదు.
ఆ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు తన సోదరి వద్దకు వెళ్లిపోయి అక్కడే ఉండసాగాడు. ఈ క్రమంలో ఓ సెకండ్ హ్యాండ్ ఫియట్ కారును కొనుగోలు చేశాడు. అంతలో సోదరితో విభేదాలు రాగా, ఈలోపు అతడి ఇంటిని అధికారులు కూల్చివేశారు. దాంతో సోదరి ఇంటి నుంచి బయటికి వచ్చేసి తన కారునే ఆవాసంగా మార్చుకున్నాడు.
సమీపంలోని అటవీప్రాంతంలో ఓ చిన్న పాక వంటి నిర్మాణం ఏర్పాటు చేసుకున్న చంద్రశేఖర్ గౌడ వెదురుబుట్టలు అల్లి, ఓ సైకిల్ పై తిరుగుతూ వాటిని సమీప గ్రామాల్లో అమ్ముతూ పొట్టపోసుకుంటున్నాడు. వాటి ధరకు మించి ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకోడని స్థానికులు చెబుతున్నారు. అతడి కథ తెలుసుకున్న మాజీ డిప్యూటీ కమిషనర్ ఏబీ ఇబ్రహీం బెంగళూరు వస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతిపాదించారు. స్థానిక రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.