MAA: మొదలైన ‘మా’ ఎన్నికల పోలింగ్.. ఉద్రిక్తత, పోలీసుల జోక్యం

MAA Elections Polling Begins

  • ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
  • పోలింగ్ కేంద్రం లోపల నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని అడ్డుకున్న శివబాలాజీ
  • చిరంజీవి, మోహన్‌బాబు మంచి మిత్రులన్న పవన్
  • వాగేవాళ్లు వాగుతూనే ఉంటారన్న ప్రకాశ్ రాజ్

తెలుగు సినీ అభిమానులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికల నేపథ్యంలో 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, వీరిలో 883 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. 500 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఈసీ సభ్యుల ఫలితాలను వెల్లడిస్తారు. చివర్లో అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అధ్యక్షుడి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్ తాను ఎవరికి ఓటు వేశానో చెప్పబోనన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులని, రాజకీయాలపై ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని అన్నారు. ఈ ఎన్నికల కారణంగా సినీ ఇండస్ట్రీ విడిపోవడమనేది ఉండదని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. పోలింగ్ అధికంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నో పాత్రలు వేసిన వాళ్లకు ఎవరెవరు ఏయే వేషాలు వేస్తున్నారో తెలుసని, వాగేవాళ్లు వాగుతూనే ఉంటారని, మనమేంటో ఓటర్లకు తెలుసని అన్నారు.

కాగా, ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News