Cricket: టీ20 వరల్డ్ కప్: సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు అనుకోని అవకాశం
- టీమిండియాకు నెట్ బౌలర్ గా ఎంపిక
- యూఏఈలోనే ఉండమన్న టీమ్ మేనేజ్ మెంట్
- ఉమ్రాన్ బౌలింగ్ తో ఇంప్రెస్ అయిన కోహ్లీ
గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టిలో పడ్డాడు సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్. ఈ సీజన్ లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరి సంచలనమే సృష్టించాడీ జమ్మూకశ్మీర్ యంగ్ స్టర్. ఇప్పుడు ఈ యువ బౌలర్ కు అనుకోని అవకాశం వచ్చింది. టీ20 వరల్డ్ కప్ కోసం అతడికి ఓ ఆఫర్ అందింది. టీమిండియాకు నెట్ బౌలర్ గా అతడు వ్యవహరించనున్నాడు. అతడిని యూఏఈలోనే ఉండాల్సిందిగా టీమ్ మేనేజ్ మెంట్ సూచించింది.
టీమ్ లో భాగం కాకపోయినా.. ఒకే ఒక్క లిస్ట్ ఏ మ్యాచ్, ఒకే ఒక్క టీ20, ఒకే ఒక్క ఐపీఎల్ ఆడిన అతడు తన ఫేట్ ను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. వాస్తవానికి హైదరాబాద్ కూ అతడు నెట్ బౌలర్ గానే ఎంపికయ్యాడు. కానీ, ప్రధాన పేసర్ నటరాజన్ గైర్హాజరుతో చాన్స్ కొట్టేశాడు.
బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా 153 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి.. విరాట్ కోహ్లీని ఇంప్రెస్ చేసింది. ఐపీఎల్ ఏటా ఎవరో ఒక ప్రతిభ కలిగిన ఆటగాడిని వెలికి తీస్తోందని కోహ్లీ చెప్పాడు. ఓ బౌలర్ స్థిరంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరడమంటే చాలా మంచి విషయమన్నాడు. ఇంత మంచి పేసర్లు తయారవడం టీమిండియాకు చాలా మంచిదన్నాడు. మరి, నెట్ బౌలర్ స్థాయి నుంచి టీమ్ లో బౌలర్ గా మారేందుకు 21 ఏళ్ల ఉమ్రాన్ ఎంత వరకు శ్రమిస్తాడో వేచి చూడాల్సిందే.