Power: దేశంలో భయపడేంత కొరత ఏం లేదు.. కరెంట్ పై కేంద్ర మంత్రి హామీ
- అనవసరంగా భయాందోళన సృష్టించారన్న ఆర్కే సింగ్
- సరిపోయేంత బొగ్గు నిల్వ ఉందని వెల్లడి
- ఎవరికైనా కరెంట్ కావాలంటే ఇస్తామని కామెంట్
దేశంలో బొగ్గు కొరత భయపడేంతగా ఏం లేదని, అనవసరంగా భయాందోళనలను సృష్టిస్తున్నారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. ఢిల్లీ సహా ఆరు రాష్ట్రాల్లో కరెంట్ కష్టాలు తప్పవన్న ఆందోళనల నేపథ్యంలో ఆయన స్పందించారు. గెయిల్, టాటా మధ్య సమాచారలోపం వల్లే ఇది జరిగిందని చెప్పారు. దేశంలో సరిపోయేంత విద్యుత్ ఉందని చెప్పారు. దేశం మొత్తానికి కరెంట్ ను సరఫరా చేస్తున్నామన్నారు. ఎవరికైనా కరెంట్ కావాలంటే అడిగితే ఇస్తామన్నారు. నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను థర్మల్ ప్లాంట్లలో మెయింటెయిన్ చేస్తున్నారని ఆయన వివరించారు.
కాగా, ఢిల్లీకి కరెంట్ కష్టాలు తప్పవన్న ఆందోళనతో కరెంట్ సరఫరాను మెరుగ్గా చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ కూడా రాశారు. దానిపై స్పందించిన ఆర్కే సింగ్.. కరెంట్ కావాలంటే కేజ్రీవాల్ తనను అడిగి ఉండాల్సిందన్నారు. తనతో మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ తో మాట్లాడానని, అంతా బాగానే ఉందంటూ ఆయన చెప్పారని వెల్లడించారు.