Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందని నిపుణులు అంటుంటే హృదయం బరువెక్కుతోంది: పవన్ కల్యాణ్
- ఏపీ ఆర్థిక స్థితిపై పవన్ స్పందన
- ఎందుకీ దుస్థితి అంటూ ఆవేదన
- ఆరు లక్షల కోట్ల అప్పులు అంటూ వ్యాఖ్యలు
- ఏపీని రక్షించుకోవాలని అన్ని వర్గాలకు పిలుపు
ఏపీ ఆర్థిక స్థితిపై జనసేన పార్టీ ఓ అర్ధవంతమైన చర్చ నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ట్విట్టర్ లో పవన్ స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, దివాళా తీసే దిశలో ఉందని ఆర్థిక నిపుణులు, మేధావులు చెబుతున్న విశ్లేషణలు వింటుంటే హృదయం భారంగా మారుతోందని తెలిపారు. రూ.6 లక్షల కోట్ల అప్పులు, మరో అర లక్ష కోట్ల రూపాయల బకాయిలు, తాకట్టులో ప్రభుత్వ ఆస్తులు... ఎందుకీ దుస్థితి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఏపీ రాష్ట్ర ఆర్థిక సంక్షోభం-ఏపీ ప్రజల భవిష్యత్తు అంశంపై తక్షణమే ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని జనసేన కోరుకుంటోంది" అని పవన్ వెల్లడించారు.
అధికార వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ఉండవల్లి అరుణ్ కుమార్, జస్టిస్ లక్ష్మణరెడ్డి, ఆంజనేయరెడ్డి (రిటైర్డ్ ఐపీఎస్), వైవీ రెడ్డి (ఆర్బీఐ మాజీ గవర్నర్), కంటిపూడి పద్మనాభయ్య (రిటైర్డ్ హోం సెక్రటరీ), శర్మ (రిటైర్డ్ ఐఏఎస్), ఐవైఆర్ కృష్ణారావు (రిటైర్డ్ సీఎస్), వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ, జయప్రకాశ్ నారాయణ, తులసి ప్రభు, ప్రొఫెసర్ కేఎస్ చలం, చలసాని శ్రీనివాసరావు వంటి మేధావులు, రైతు, ప్రభుత్వ, ప్రైవేటు, ఉద్యోగ, కార్మిక, సచివాలయం, ప్రజా సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు.