Drugs: తాలిబన్ల మరో అరాచకం.. డ్రగ్స్ బానిసలపై అనాగరిక చర్యలు
- గుండు కొట్టించి, తిండి పెట్టకుండా హింసిస్తున్న తాలిబన్లు
- డ్రగ్స్ వాడడం ఇస్లాం ప్రకారం తీవ్ర నేరమంటూ కఠిన శిక్షలు
- చిక్కి శల్యమై జీవచ్ఛవాల్లా కనిపిస్తున్న డ్రగ్స్ బానిసలు
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డ్రగ్స్ బానిసలపై వారు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని సాధారణంగా బాధితులుగా పరిగణించి వైద్య సహాయం అందించడంతోపాటు, కౌన్సెలింగ్ వంటి వాటితో వారిని తిరిగి మామూలు మనుషులుగా మార్చే ప్రయత్నం చేస్తారు.
అయితే, తాలిబన్లు మాత్రం డ్రగ్స్ బానిసలపై క్రూరంగా వ్యవహరిస్తున్నారు. వారిని జైళ్లలాంటి శిబిరాలకు తరలించి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. గుండు కొట్టించడంతోపాటు సరైన తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. ఫలితంగా వారంతా చిక్కి శల్యమై జీవచ్ఛవాల్లా కనిపిస్తున్నారు.
మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారు కాబూల్లో వేలాదిమంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది రహదారుల వంతెనల కింద తలదాచుకుంటున్నారు. రాత్రిపూట అకస్మాత్తుగా దాడులు జరుపుతున్న తాలిబన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని చేతులు కట్టేసి ప్రత్యేక శిబిరాలకు తరలించి కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.
డ్రగ్స్ వాడడం ఇస్లాం ప్రకారం తీవ్ర నేరమని చెబుతున్న తాలిబన్లు.. వారు సమాజ వినాశకారులంటూ తీవ్ర శిక్షలు విధిస్తున్నారు. క్రూరంగా వ్యవహరిస్తే తప్ప డ్రగ్స్ అలవాటును మాన్పించలేమని చెబుతూ సరైన తిండిపెట్టకుండా హింసిస్తున్నారు. ఇలా చేస్తే కొందరు మరణించినా మిగతా వారైనా మారుతారని తాలిబన్లు చెబుతున్నారు.