Prakash Raj: నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది.. అందుకే 'మా'కు రాజీనామా చేస్తున్నా: ప్రకాశ్ రాజ్
- ప్రాంతీయ వాదం, జాతీయవాదం తెరపైకి వచ్చాయి
- తెలుగు బిడ్డను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు
- నేను తెలుగు బిడ్డను కాదు.. అది నా తప్పు కాదు
- ఓ అతిథిగానే వుండమన్నారు, అలాగే ఉంటా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వానికి సినీనటుడు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ప్రకాశ్ రాజ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఆయన నాన్ లోకల్ అంటూ, తెలుగువాడు కాదంటూ కొందరు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చిందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. విశ్లేషించాల్సింది చాలా ఉందని, దానిపై చర్చిస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా ఎన్నికల్లో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయవాదం భావోద్వేగాల మధ్య జరిగాయని చెప్పుకొచ్చారు.
తెలుగు బిడ్డను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పారు. తాను తెలుగు బిడ్డను కాదని అన్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాదని, అది వారి తప్పు కాదని, తన తప్పు కూడా కాదని అన్నారు. తెలుగు వ్యక్తినే ఓటర్లు ఎన్నుకున్నారని తెలిపారు. అతడు మంచి వ్యక్తేనని అన్నారు.
అయితే, 'నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది.. అందుకే 'మా'కు రాజీనామా చేస్తున్నా'నని తెలిపారు. తనకు, ప్రేక్షకులకు మధ్య అనుబంధం మాత్రం సినిమాలతో కొనసాగుతుందని చెప్పారు. తనను ఓ అతిథిగానే ఉండాలని, అసోసియేషన్ సభ్యులు భావిస్తున్నారని, అలాగే ఉంటానని అన్నారు.