Cricket: ధోనీ బ్యాటింగ్ చూసి.. సీట్ లో నుంచి లేచి గంతేసిన కోహ్లీ

Kohli Admires Seeing MSD Finishing Touch Says King Is Back

  • నిన్న జరిగిన మ్యాచ్ లో డీసీపై చెన్నై గెలుపు
  • 6 బంతుల్లో 18 పరుగులు చేసిన ధోనీ
  • కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లీ ట్వీట్
  • గవాస్కర్, హేడెన్, జైషాల ప్రశంసలు

మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్ అని పేరు. అయితే, ఇటీవలి కాలంలో అతడి మ్యాజిక్ పోయిందని అందరూ విమర్శించారు. అతడి ఆటతీరు కూడా అలాగే ఉంది. ధోనీలోని ఆ ఫినిషర్ ఏమైపోయాడన్న ప్రశ్నలొచ్చాయి. అయితే, తనలోని ఫినిషర్ నిద్రలేస్తే ఎలాగుంటుందో మరోసారి నిరూపించాడు ధోనీ.

నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో విరుచుకుపడి 18 పరుగులు పిండేశాడు. ఈ మ్యాచ్ లో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదోసారి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే, ధోనీ బ్యాటింగ్ చూసి మాజీలు, ఇప్పటి క్రికెటర్లు తెగ సంబరపడిపోతున్నారు. టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లీ.. ధోనీ బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించాడు.

కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరపడ్డాడు. గొప్ప షినిషింగ్ టచ్ ఇచ్చి తనను సీట్ లో నుంచి లేచి ఎగిరి గంతేసేలా చేశాడని, ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్ ధోనీ అంటే తనకెంతో ఇష్టమని ట్వీట్ చేశాడు. సునీల్ గవాస్కర్ కూడా ధోనీ బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. జడేజా బాగా ఆడుతున్నా.. కెప్టెన్ గా బాధ్యత తీసుకుని ధోనీ బ్యాటింగ్ వరుసలో ముందుగానే వచ్చాడని, అది చాలా మంచి విషయమని పేర్కొన్నాడు. అవసరమైనప్పుడు స్టైలిష్ గా పని పూర్తి చేశాడంటూ కొనియాడాడు. కెప్టెన్ గా గెలిపించాలనుకుని సఫలమయ్యాడన్నాడు.

ధోనీ బ్యాటింగ్ చాలా సంతోషాన్నిచ్చిందని, ఎంతో అద్భుతంగా ఆడాడని ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. అతడికి ఏడో నంబర్ బాగా కలిసివస్తుందన్నాడు. అతడి బ్యాటింగ్ గురించి ఎందరో ఎన్నో రకాలుగా మాట్లాడారన్నాడు. ఫినిషర్ గా ధోనీది ఇది కళాత్మక ప్రదర్శన అని బీసీసీఐ సెక్రటరీ జైషా అన్నారు. అతడిలా మ్యాచ్ ముగిస్తే ఎన్నో జ్ఞాపకాలు కళ్లముందు కదులుతాయని చెప్పాడు. కెప్టెన్ గా ధోనీ మరోసారి ఫినిషర్ అవతారం ఎత్తి జట్టును విజయతీరాలకు చేర్చాడంటూ ప్రీతి జింటా పేర్కొంది.

  • Loading...

More Telugu News