Kim Jong Un: తొలిసారి కొరియా నియంత కిమ్ నోటి నుంచి మంచి మాటలు.. విని బిత్తరపోయిన అధికారులు

Kim Jong Un Asks Officials To Look After Public
  • ప్రజాసంక్షేమానికి పాటుపడాలని సూచన
  • జనాల ఆకలి బాధలను తీర్చాలని ఆదేశాలు
  • హింసిస్తే ఊరుకోబోనని హెచ్చరికలు
  • పార్టీ 76వ వార్షికోత్సవ సమావేశంలో కామెంట్లు
అణ్వస్త్ర ప్రయోగాలతో అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. జనానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించిన కర్కోటకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు కొంత తగ్గినట్టున్నారు. తన రాజ్యంలోని జనాల ఆకలి బాధలను చూసి చలించిపోయాడట కిమ్.

నిన్న పాంగ్యాంగ్ లో జరిగిన అధికార పార్టీ 'వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా' 76వ వార్షిక సమావేశంలో ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగం విన్న అధికారులూ షాక్ కు గురయ్యారట. మాట్లాడుతున్నది ఆయనేనా అని ఆశ్చర్యపోయారట. ఈ వివరాలను కొరియా ప్రభుత్వ అధికారిక పత్రిక కేసీఎన్ఏ వెల్లడించింది. కార్యక్రమాన్ని ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా చేయడం విశేషం.  

ఏనాడూ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోని కిమ్.. ఇప్పుడు కొన్ని మంచి మాటలు మాట్లాడేసరికి నిశ్చేష్టులైపోయారట. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా పతనమైనా.. జనాల ఆకలి బాధలను తీర్చాలని, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలని అధికారులకు కిమ్ సూచించారు.

వాస్తవానికి అణ్వాయుధాల తయారీతో అమెరికా సహా చాలా దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఆపైన కరవు, వర్షాలు, వరదలతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా చైనాతో వాణిజ్యం పూర్తిగా దెబ్బతింది. మొత్తంగా ప్రజలు ఆహార, ఔషధ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే పార్టీ వార్షికోత్సవం సందర్భంగా జనాలను ఈ విపత్తు నుంచి బయటపడేయాల్సిందిగా అధికారులకు కిమ్ సూచించారు. ఆర్థిక సంక్షోభాన్ని కలిసి ఎదుర్కొందామంటూ పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే మొదటి ప్రాధాన్యమని, మిగతా వాటిని పక్కనపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు. ప్రజల హక్కులను కాలరాసినా, వారికి విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. మరి, ఆయన నిజంగానే మారారా? మారితే ఆ మార్పు ఎన్ని రోజులుంటుంది? అన్న చర్చ ఇప్పుడు అధికార వర్గాల్లో సాగుతోందట.
Kim Jong Un
Kim Jong-un
North Korea

More Telugu News