Stock Market: లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఆటో, బ్యాంకింగ్ షేర్ల అండతో కొనుగోళ్లు
- 76.72 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
- 50.75 పాయింట్ల లాభంతో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం మార్కెట్లు ఓపెన్ అయినప్పటి నుంచీ లాభాలలోనే కొనసాగాయి. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు ఆటో, బ్యాంకింగ్ సెక్టార్ లోని షేర్ల అండతో కొనుగోళ్లు జరిగి, మార్కెట్లు లాభాలను చవిచూశాయి.
మరోపక్క, కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందన్న నివేదికలు వస్తుండడం మదుపరులలో నమ్మకాన్ని పెంచింది. దీంతో చివరికి సెన్సెక్స్ 76.72 పాయింట్ల లాభంతో 60,135.78 వద్ద; 50.75 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17945.95 వద్ద ముగిశాయి.
ఇక నేటి సెషన్ లో టాటా మోటార్స్, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, మారుతి సుజుకి, గ్రాసిమ్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసీఐ బ్యాంక్, అమరరాజా బ్యాటరీస్ తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి. మరోపక్క, టీసీఎస్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, విప్రో తదితర షేర్లు నష్టాలు పొందాయి.