Telangana: పదో తరగతిలో ఈసారి ఆరు పరీక్షలే.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- 11 పేపర్లను ఆరుకు కుదించిన ప్రభుత్వం
- ఒక్కో పేపర్‌కు 80 మార్కులు
- అంతర్గత పరీక్షలకు 120 మార్కులు
- భౌతిక, జీవశాస్త్రాలకు పరీక్ష ఒకటే కానీ జవాబు పత్రాలు మాత్రం రెండు
పదో తరగతి పరీక్షల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈసారి వాటిని ఆరుకు కుదిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గత విద్యా సంవత్సరం (2020-21) కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పటికీ కరోనా కారణంగా అసలు పరీక్షలు జరగలేదు. ఈసారి కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు గత నెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 1-10 తరగతుల పరీక్షలకు గతేడాదిలానే 70 శాతం సిలబస్ ఉంటుందని మరో ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో హిందీ సహా మిగతా సబ్జెక్టులకు కూడా ఒక్కో పరీక్షనే నిర్వహిస్తారు. గతంలో ఒక్కో పరీక్షకు 40 మార్కులు కేటాయించేవారు. ఈసారి ఒక్క పేపర్‌కు 80 మార్కులు ఇవ్వనున్నారు. అంతర్గత మార్కులు యథాతథంగానే ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు కేటాయిస్తారు.
అలాగే, గతంలో ఉన్న నాలుగు అంతర్గత పరీక్షలను ఈసారి రెండుకు తగ్గించారు. రాత పరీక్షకు 480, అంతర్గత పరీక్షలకు 120 చొప్పున మొత్తంగా 600 మార్కులకు పరీక్షలు నిర్వహస్తారు. భౌతిక శాస్త్రానికి, జీవశాస్త్రానికి పరీక్ష ఒకటే అయినా రెండు జవాబు పత్రాలు ఇస్తారు. ఈ రెండు సబ్జెక్టులకు సమాధానాలు వేర్వేరుగా రాయాల్సి ఉంటుంది.