Sharmila: బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా రాష్ట్రాన్ని కేసీఆర్ మార్చారు: షర్మిల
- బంగారు తెలంగాణ తీసుకువస్తామని చెప్పారు
- విశ్వ విద్యాలయాల భూములపై టీఆర్ఎస్ నేత కన్ను
- విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున పోస్టుల ఖాళీలు
- విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని భయమా?
విశ్వ విద్యాలయాల భూములపై టీఆర్ఎస్ నేత కన్ను పడిందంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం ఆమె నిరాహారదీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె నల్గొండ పట్టణంలో దీక్ష చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... బంగారు తెలంగాణ తీసుకువస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని ఆమె విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 33 శాతం పోస్టుల ఖాళీలు ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ఏ వర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలు ఉన్నాయని చెప్పారు.
అసలు విద్యార్థుల భవిష్యత్‌ను కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆమె మండిపడ్డారు. విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆమె ఆరోపించారు.