Chandrababu: హైకోర్టు ఆదేశించినా కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లింపులు చేయడంలేదు?: చంద్రబాబు

Chandrababu questions AP Govt

  • ఉపాధి హామీ బకాయిలపై చంద్రబాబు స్పందన
  • కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు ఏంటని ఆగ్రహం
  • ఏలూరులో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడని వెల్లడి
  • కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచన

ఉపాధి హామీ పథకం చెల్లింపులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లింపులు చేయడంలేదని మండిపడ్డారు. గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులేమిటని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని, వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రయత్నించడం దారుణమని అన్నారు.

రాష్ట్రంలో అన్ని రకాల పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.80 వేల కోట్ల మేర బకాయి పడిందని ఆరోపించారు. ఈ డబ్బులు చెల్లించేది ఎప్పుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావడంలేదని తెలిపారు. అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని వెల్లడించారు.

బిల్లులు చెల్లించకుండా వేధించడంతో ఏలూరులో  కాంట్రాక్టర్ రంజిత్ ఆత్మహత్యాయత్నం చేశాడని చంద్రబాబు తెలిపారు. రంజిత్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేయొద్దని సూచించారు. ఉపాధి హామీ పనుల బకాయిలకు సంబంధించి ప్రతి పైసా అందే వరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News