Prakash Raj: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో విజయం సాధించిన 11 మంది రాజీనామా

Prakash Raj panel winners resigned

  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్
  • తమ సభ్యులు 'మా'లో కొనసాగడంలేదని వెల్లడి
  • మంచు విష్ణు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని సూచన
  • ఓటర్ల తరఫున ప్రశ్నిస్తామని వివరణ

'మా' ఎన్నికలో ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని, తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. 'మా' అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని అన్నారు. ఇప్పుడు అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు 'మా' కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు.

సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు. వారు ఇకపై మంచు విష్ణు అధ్యక్షతన నడిచే 'మా'లో కొనసాగరని, మంచు విష్ణు తన వాళ్లతో స్వేచ్ఛగా 'మా' కార్యకలాపాలు కొనసాగించవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మంచు విష్ణు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారని, వాటి అమలులో అడ్డు రాకూడదని తమ ప్యానెల్ నిర్ణయించుకుందని పేర్కొన్నారు.

అయితే తమను గెలిపించిన ఓటర్లకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, రేపు మంచు విష్ణు పనిచేయకపోతే వారి తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదని, ఎంతో హుందాగా తీసుకున్న నిర్ణయం అని వివరించారు. తమకు కూడా గణనీయంగా ఓట్లు పడ్డాయని, అందుకే ఓటర్ల తరఫున తాము బాధ్యతగా వ్యవహరిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ తన రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగువారు కానివాళ్లు పోటీ చేసేందుకు అనర్హులు అనే నిబంధన తీసుకురాకపోతే తన రాజీనామా వెనక్కి తీసుకునేందుకు తాను సిద్ధమని అన్నారు.

  • Loading...

More Telugu News