Banarjee: తనీశ్ ను తిడుతుంటే అడ్డు వెళ్లాను... దాంతో మోహన్ బాబు అరగంటసేపు బూతులు తిట్టారు: బెనర్జీ
- ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్
- కన్నీటిపర్యంతమైన బెనర్జీ
- మోహన్ బాబు ఎలా తిట్టిందీ వివరించిన వైనం
- మోహన్ బాబు భార్య ఫోన్ చేసి బాధపడ్డారని వెల్లడి
'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి నటుడు బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. ఇవాళ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నిర్వహించిన మీడియా సమావేశంలో బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజున తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుని బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నికల్లో తాను నెగ్గానని ఇతరులు చెబుతున్నప్పటికీ తాను ఓ చలనం లేని వాడిలా ఉండిపోయానని, ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయానని వణుకుతున్న స్వరంతో చెప్పారు. ఆ పరిస్థితికి కారణమేంటో బెనర్జీ వివరించారు.
"పోలింగ్ రోజున బూత్ వద్ద దూరంగా నిలబడ్డాను. తనీశ్ ను మోహన్ బాబు గారు తిట్టడం చూశాను. అక్కడే విష్ణు కూడా ఉండడంతో నేను ఆయన వద్దకు వెళ్లి... గొడవలు వద్దని చెప్పాను. దాంతో మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. అరగంటసేపు నన్ను పచ్చిబూతులు తిట్టారు. కొట్టబోయారు కూడా.
ఒకప్పుడు మోహన్ బాబు మా ఇంటి మనిషిగా, నేను మోహన్ బాబు ఇంటి మనిషిగా ఉన్నాం. మంచు లక్ష్మి పుట్టినప్పుడు ఆమెను ఎత్తుకుని తిరిగాను. విష్ణును ఎత్తుకుని తిరిగాను. అలాంటిది అమ్మనా బూతులు తిట్టారు. ఆయన అలా తిడుతూ ఉంటే విష్ణు, మనోజ్ వచ్చి సారీ అంకుల్... ఆయనను మళ్లీ ఏమీ అనవద్దు అని రిక్వెస్ట్ చేశారు. ఆయన డీఆర్సీ సభ్యుడు అయివుండీ కూడా ఇలా ప్రవర్తించారు. ఇతర డీఆర్సీ సభ్యులు కూడా దీన్ని అడ్డుకోలేదు. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ దూరంగా ఉన్నారు. పాపం తనీశ్ ఏడుస్తూ ఉండిపోయాడు.
ఆ తర్వాత మోహన్ బాబు అర్ధాంగి నిర్మల గారు ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. ఆ ఘటనను మర్చిపోలేకపోతున్నాను. మూడు రోజుల నుంచి ఒకటే వేదన. అందుకే మా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పుడన్నా నా బాధ తగ్గుతుందేమో!" అని వివరించారు.