Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గల్లంతులో సాయికుమార్ ముఠాపై కీలక ఆధారాలు లభ్యం
- తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల గల్లంతు
- కోట్లాది రూపాయల మాయం
- ప్రధాన నిందితుడు సాయికుమార్ మాయాజాలం
- రూ.200 కోట్ల వరకు స్వాహా
తెలుగు అకాడమీ నిధులు కోట్లాది రూపాయల మేర గల్లంతైన వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికుమార్ కోట్లు కొల్లగొట్టినట్టు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సాయికుమార్, అతని అనుచరులు గత పదేళ్ల కాలంలో సుమారు రూ.200 కోట్ల వరకు స్వాహా చేసినట్టు గుర్తించారు. సాయికుమార్ ముఠా ప్రభుత్వ సంస్థల ఫిక్స్ డ్ డిపాజిట్లను కొల్లగొట్టడంలో ఆరితేరినట్టు వెల్లడైంది.
సాయికుమార్, అతని అనుచరులు 12 ఏళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సాయికుమార్ బృందంపై ఇప్పటికే 7 కేసులు ఉన్నాయి. ఏపీలో మరో 2 ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజిట్లు కాజేసినట్టు వెల్లడైంది. సాయికుమార్ గతంలో స్వాల్ కంప్యూటర్స్ పేరిట ఓ సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించాడు. చెన్నైకి చెందిన నేరస్తులతో అతడికి పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా వీరు ఓ ముఠాగా ఏర్పడి, బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు గోల్ మాల్ చేయడం ప్రారంభించారు.
జాతీయ, కార్పొరేట్, సహకార బ్యాంకు మేనేజర్లతో ఈ ముఠాకు పరిచయాలు ఉన్నాయి. తమ గోల్ మాల్ వ్యవహారంలో పలువురు బ్యాంకు మేనేజర్లను కూడా భాగస్వాములుగా చేశారు. కమీషన్ల ఆశ చూపి ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఫిక్స్ డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు. ఒప్పందం చేసుకున్న బ్యాంకుల్లోనే ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజిట్లు గోల్ మాల్ చేసేలా ప్రణాళిక రచించారు.
నకిలీ ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలు తయారుచేసి ఆయా ప్రభుత్వ శాఖలకు అందించేవారు. అసలు పత్రాలను బ్యాంకుల్లో సమర్పించి ప్రభుత్వ సొమ్మును కొట్టేసేవారు. ఈ విధంగా దాదాపు రూ.200 కోట్ల వరకు కొల్లగొట్టినట్టు పోలీసులు గుర్తించారు. మాస్టర్ మైండ్ గా సాయికుమార్ ఇందులో రూ.80 కోట్లు తీసుకున్నట్టు వెల్లడైంది. తణుకుకు చెందిన వెంకటరమణ, సత్తుపల్లికి చెందిన వెంకట్ ఈ భాగోతంలో సాయికుమార్ కు ప్రధాన భాగస్వాములు. సాయికుమార్ కు సహకరించిన ఆరుగురు బ్యాంకు మేనేజర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.