Konda Vishweshwar Reddy: తెలంగాణ ద్రోహులందరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు.. నిప్పులు చెరిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి
- టీఆర్ఎస్ తండ్రీకుమారుల పార్టీ
- ఓడిపోయే యుద్ధం కాబట్టే యువరాజు ఇక్కడికి రావడం లేదు
- నియంత పాలన అంతమైతేనే రాష్ట్రం బాగు
టీఆర్ఎస్పై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ తండ్రీకుమారుల పార్టీ అని, తెలంగాణ ద్రోహులందరూ మూకుమ్మడిగా అందులోనే ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడాలంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలవాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలను పార్టీ నుంచి బయటకు తరమేస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.
ఆ పార్టీలో తండ్రీకుమారులకు తప్ప మరెవరికీ మాట్లాడే అధికారం లేదనీ, నియంత పాలన అంతమైతే తప్ప రాష్ట్రం బాగుపడదని అన్నారు. ఓడిపోయే యుద్ధం కాబట్టే యువరాజు ఇక్కడికి రావడం లేదని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఈటల వల్లే దళితబంధు పథకం తెచ్చారన్న విషయం ప్రజలకు అర్థమైందన్న ఆయన.. కాళేశ్వరం ఓ కమీషన్ ప్రాజెక్టు అని విమర్శించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వేశ్వరరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.