Shatrugan Sinha: షారుఖ్ ఖాన్ కొడుకుని అరెస్ట్ చేయడానికి ఇదే కారణం: శత్రుఘ్నసిన్హా
- ఆర్యన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు కావడమే కారణం
- అరెస్ట్ అయిన వారిలో ఇతరుల గురించి మాట్లాడటం లేదు
- ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదు
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్యన్ అరెస్ట్ పై బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, రాజకీయవేత్త శత్రుఘ్నసిన్హా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
షారుఖ్ ఖాన్ కొడుకు కావడం వల్లే ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. ఆర్యన్ అరెస్ట్ కు షారుఖ్ ను టార్గెట్ చేయడం మాత్రమే కారణమని అన్నారు. ఎన్సీబీ అరెస్ట్ చేసిన వారిలో మున్ మున్ ధమేచా, అర్బాజ్ మర్చెంట్ వంటి వారు కూడా ఉన్నారని... అయితే వారి గురించి ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని చెప్పారు.
గతంలో కూడా ఇలాగే జరిగిందని... కొందరిని ఎన్సీబీ విచారించిన సమయంలో కేవలం దీపికా పదుకుణేపై మాత్రమే ఫోకస్ చేశారని అన్నారు. షారుఖ్ ముస్లిం అయినందుకే టార్గెట్ చేశారా? అనే ప్రశ్నకు బదులుగా... తాను అలా భావించడం లేదని చెప్పారు. ముస్లిం అయినందుకే ఇలా చేస్తున్నారంటూ ఇప్పుడు కొందరు అంటున్నారని... అయితే అది నిజం కాదని అన్నారు. ప్రతి భారతీయుడు కూడా ఈ దేశ పుత్రుడేనని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతస్థులకు సమాన హక్కులు ఉన్నాయని అన్నారు.
ఆర్యన్ దగ్గర ఎన్సీబీ అధికారులకు డ్రగ్స్ దొరకలేదని సిన్హా చెప్పారు. ఒకవేళ డ్రగ్స్ దొరికినా ఒక ఏడాది పాటు శిక్ష పడే అవకాశం ఉంటుందని అన్నారు. ఇలాంటి కేసుల్లో బ్లడ్, యూరిన్ టెస్టులు చేస్తారని... అయితే ఆర్యన్ కు ఆ పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో భయస్తులు ఎక్కువగా ఉంటారని... ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు వారు భయపడుతుంటారని అన్నారు. ఇది ఇతరుల సమస్య, మనకెందుకులే అనే ధోరణిలో ఉంటారని విమర్శించారు. ఎవరి కష్టాల నుంచి వారే బయటపడాలని అనుకుంటుంటారని చెప్పారు.