MAA: 'పెదరాయుడి'లా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని చిరంజీవి ఎప్పుడూ అనలేదు: నాగ‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

nagababu slams maa

  • సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య  ఎప్పుడూ అనుకోలేదు
  • చిరంజీవికి అంత అహంకారం లేదు
  • ఎవరైనా కష్టాల్లో త‌మ ఇంటికి వస్తే చిరంజీవి సాయం చేస్తారు
  • మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన కూడా మాకు లేదు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ముగిసిన‌ప్ప‌టికీ మాట‌ల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. ఎన్నిక‌ల్లో ప్రకాశ్‌రాజ్ కు మ‌ద్ద‌తుగా నిలిచిన సినీన‌టుడు నాగ‌బాబు 'మా'కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. రాజీనామా లేఖ‌లో అసోసియేష‌న్ స‌భ్యుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న  ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగిన తీరుపై మండిప‌డ్డారు.

సాధారణ ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరుగుతాయో అలాంటివే మా ఎన్నికల్లోనూ జ‌రిగాయని నాగ‌బాబు ఆరోపించారు. మామూలుగా ఎన్నిక‌లప్పుడు సభ్యుల సంక్షేమం, అసోసియేషన్‌ అభివృద్ధికి ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటామో తెలుపుతూ ఆయా అభ్యర్థులు పోటీ చేస్తార‌ని, అయితే, ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో మాత్రం ప్రాంతీయ వాదం, కులంతో పాటు ప్రకాశ్ రాజ్ వృత్తిపరమైన విషయాలనూ తీసుకొచ్చారని ఆయ‌న అన్నారు.

ప్ర‌కాశ్ రాజ్ వ్య‌క్తిగ‌త హోదాకు ఇబ్బంది కలిగేలా ప్రత్యర్థి ప్యానల్‌ సభ్యులు కామెంట్లు చేశార‌ని తెలిపారు. దీంతో ప్ర‌కాశ్ రాజ్‌కు మ‌ద్దుతుదారుడిగా తాను వారికి కౌంటర్‌ ఇచ్చానని చెప్పారు. తాను ఇన్నాళ్లు మాలో భాగమైనందుకు చాలా గర్వపడ్డానని తెలిపారు.

తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని తాను అనుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల తర్వాత నిజాలు తెలుసుకుని, సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదని ఆయ‌న చెప్పారు. అందుకే తాను మ‌న‌స్తాపం చెందాన‌ని, మా నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. త‌న‌కు ఇక‌పై 'మా'తో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు.

ఇక, సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదని ఆయ‌న తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన వారు, ఇత‌రులు ఎవరైనా కష్టాల్లో త‌మ ఇంటికి వస్తే చిరంజీవి తనకు చేతనైనంత సాయం చేశారని నాగ‌బాబు చెప్పారు. అంతేగానీ, ఆయ‌న పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదని తెలిపారు. చిరంజీవికి అంత అహంకారం లేదని నాగబాబు అన్నారు. త‌మ‌కు మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన కూడా లేద‌ని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News