Congress: రాష్ట్రపతిని కలిసిన రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ సీనియర్ నేతలు
- లఖింపూర్ ఖేరీలో హింసపై ఫిర్యాదు
- అజయ్ మిశ్రా రాజీనామా చేయాలన్న రాహుల్
- సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని వ్యాఖ్య
- ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ జాతీయ నేతలు ఈ రోజు ఉదయం కలిసి పలు అంశాలను వివరించారు. రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌ను కలిసిన వారిలో మల్లికార్జున ఖర్గే, ఏకే అంటోనీ, గులాం నబీ ఆజాద్, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఉన్నారు. లఖింపూర్ ఖేరీలో ఇటీవల జరిగిన హింసపై కోవింద్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా అన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. దేశంలో రైతులు, ఎస్సీలు, మహిళలకు న్యాయం జరగట్లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.