Andhra Pradesh: హెరాయిన్ కేసు.. ప్రభుత్వ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామన్న పట్టాభిరామ్

will see in Court said tdp leader pattabhi on AP DGP Notices

  • డీజీపీ గౌతం సవాంగ్  పంపిన నోటీసులపై స్పందించిన టీడీపీ
  • జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయన్న పట్టాభిరామ్
  • టీడీపీ చేసిన ఆరోపణలతోనే పోలీసుల పరువు మంటగలిసిపోయిందా?
  • వైసీపీ నేతల ప్రమేయాన్ని ప్రశ్నించినందుకే నోటీసులు
  • ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందిస్తాం

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌ ఘటనతో ఏపీకి సంబంధాలు ఉన్నాయని అసత్య ఆరోపణలు చేశారంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పంపిన నోటీసులపై టీడీపీ స్పందించింది. ప్రభుత్వం పంపిన నోటీసులపై కోర్టుల్లోనే తేల్చుకుంటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. డ్రగ్స్ విషయంలో అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని ప్రశ్నించామన్న అక్కసుతోనే నోటీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి లింకులు ఉన్నాయని జాతీయ మీడియా కూడా పలు కథనాలు ప్రచురించిందని, మరి వాటికి నోటీసులు ఇచ్చే దమ్ము, ధైర్యం డీజీపీకి ఉన్నాయా అని నిలదీశారు. టీడీపీ చేసిన ఆరోపణలతోనే పోలీసుల పరువు, ప్రతిష్ఠలు మంటగలిసి పోయాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ విషయంలో వైసీపీ నేతల ప్రమేయంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఈ సమాచారాన్ని తాము కేంద్ర దర్యాప్తు సంస్థలకే అందిస్తామని పట్టాభి తెలిపారు.

కాగా, గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌కు ఏపీతో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ లీగల్ నోటీసులు పంపారు.

అలాగే, ఈ వ్యవహారంపై కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు, రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఈనాడు బ్యూరో చీఫ్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, అమోద పబ్లికేషన్స్, ప్రింటర్, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆ పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్, బ్యూరో చీఫ్‌లకు కూడా లీగల్ నోటీసులు పంపారు.

అసత్య ఆరోపణలు చేసినందుకు గాను నోటీసులు అందుకున్న వారందరూ బేషరతు క్షమాపణలు చెప్పాలని, ఆ వార్తను తమ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News