Hyderabad: గణేశ్ నిమజ్జనం తర్వాత హుసేన్‌సాగర్‌లో కాలుష్యం పెరుగుతుందనుకుంటే భారీగా తగ్గింది.. పీసీబీ నివేదిక
- ఇటీవల కురిసిన భారీ వర్షాలే కారణం
- గత ఏడాది కన్నా తగ్గిన కాలుష్యం
- హుసేన్సాగర్ నీటి నాణ్యతను పరిశీలించిన పీసీబీ
హైదరాబాద్‌లోని హుసేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనం తర్వాత కాలుష్యం పెరుగుతుందనుకుంటే భారీగా తగ్గింది. అందుకు గణేశ్ నిమజ్జనం తర్వాత కురిసిన భారీ వర్షాలే కారణం. గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల హుసేన్‌సాగర్‌లో కాలుష్యం పెరుగుతుందని ఇటీవల పలువురు ఆందోళన వ్యక్తం చేసిన వేళ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక శుభవార్త తెలిపింది.
ప్రతి ఏడాది గణేశ్ విగ్రహాల నిమజ్జనం తర్వాత హుసేన్‌సాగర్‌లో కాలుష్య స్థాయిని పరిశీలిస్తారు. ఈ క్రమంలో పరిశీలించగా, గత ఏడాది కంటే హుసేన్‌సాగర్‌లో ఈ సారి కాలుష్యం భారీగా తగ్గిందని పీసీబీ స్పష్టం చేసింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ముందు, విగ్రహాల నిమజ్జనాలు జరిగిన రోజులతో పాటు ఆ తర్వాత హుసేన్సాగర్ నీటి నాణ్యతను పరిశీలించారు.
ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, లేపాక్షి ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం తగ్గుముఖం పట్టిందని పీసీబీ తెలిపింది. అయితే, కరిగిన ఘనపదార్థాల మోతాదు పెరిగిందని వివరించింది.
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ తో పాటు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, భార లోహాల మోతాదు పెరిగాయి. గణేశ్ విగ్రహాల నిమజ్జనం తర్వాత భారీగా వర్షాలు కురవడంతో హుసేన్‌సాగర్‌లో భారీగా వరద నీరు చేరింది. దీంతో కాలుష్య స్థాయి తగ్గింది.