Chiranjeevi: ఆ విధంగా 'ఆచార్య' హిందీ వెర్షన్ ని ప్లాన్ చేస్తున్నారట!
- 'బాహుబలి'తో పెరిగిన తెలుగు సినిమా మార్కెట్
- జనవరి 7న రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' విడుదల
- 'ఆర్ఆర్ఆర్'పై బాలీవుడ్ లో భారీ అంచనాలు
- హిందీలో చరణ్ మార్కెట్ పెరిగే అవకాశం
- ఫిబ్రవరిలో 'ఆచార్య' హిందీలో కూడా రిలీజ్
ఇటీవలి కాలంలో తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమాకు మార్కెట్ విపరీతంగా విస్తృతమైంది. ముఖ్యంగా మన స్టార్ హీరోల సినిమాలు హిందీలో కూడా బాగా మార్కెట్ అవుతుండడంతో పాన్ ఇండియా లెవెల్లో మన చిత్రాల నిర్మాణం జరుగుతోంది.
అందుకే, మన హీరోలు హిందీ మార్కెట్టును కూడా దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాల కథలను తయారుచేయించుకుంటున్నారు. ఈ కోవలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వచ్చే జనవరి 7న వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా స్థాయిని బట్టి ఇది సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఇప్పటికే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందీలో కూడా ఈ సినిమా మంచి మార్కెట్ చేస్తుందని భావిస్తున్నారు.
దీంతో రామ్ చరణ్ కు కూడా ఆటోమేటిక్ గా అక్కడ మార్కెట్ పెరుగుతుందనీ, అది 'ఆచార్య'కు ప్లస్ అవుతుందనీ విశ్లేషిస్తున్నారు. అందుకే, 'ఆచార్య'ను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారట. పైగా, ఇందులో కాజల్, పూజ హెగ్డే వంటి బాలీవుడ్ లో పేరున్న కథానాయికలు కూడా వుండడం మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని 'ఆచార్య' హిందీ వెర్షన్ ని సిద్ధం చేస్తున్నారట!