Jagan: డబ్బుల కొరత లేదు.. బొగ్గు ఎక్కడున్నా కొనండి.. కరెంట్ కోతలు ఉండకూడదు: జగన్
- విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకోండి
- థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేయాలి
- సింగరేణితో సమన్వయం చేసుకోవాలి
ఏపీలో విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ పరిస్థితులపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత బొగ్గు నిల్వలు, థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ పై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం వద్ద నిధుల కొరత లేదని... దేశంలో బొగ్గు ఎక్కడ లభ్యమయినా కొనుగోలు చేయాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో నడిచేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు.
తెలంగాణలోని సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరాలకు తగ్గట్టుగా బొగ్గును తెప్పించుకోవాలని జగన్ చెప్పారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని చెప్పారు.