Manmohan Singh: కేంద్ర ఆరోగ్య మంత్రిపై మన్మోహన్‌ కుటుంబం ఆగ్రహం

Manmohan Singh family anger on Union Health minister
  • ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్మోహన్
  • ఫొటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని వెళ్లిన మన్ సుఖ్ మాండవీయ
  • ఫొటోగ్రాఫర్ వద్దని చెప్పినా పట్టించుకోని వైనం
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో మన్మోహన్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు ఆరోగ్య మంత్రి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.

ఈ సందర్భంగా మన్మోహన్ తో మాండవీయ ఫొటోలు తీయించుకున్నారు. ఫొటోగ్రాఫర్ ను అనుమతించవద్దని కుటుంబసభ్యులు చెపుతున్నా ఆయన పట్టించుకోలేదట. ఈ అంశంపై మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఈరోజు ఒక ప్రకటన ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తమ మాటలను పట్టించుకోకుండా తన తండ్రితో కలిసి మాండవీయ ఫొటోలు తీయించుకున్నారని ఆమె చెప్పారు. ఫొటోగ్రాఫర్ ను తీసుకురావద్దని చెప్పినా ఆయన పట్టించుకోలేదని అన్నారు. తన తండ్రికి రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉందని... ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో సందర్శకులను తాము కట్టడి చేశామని తెలిపారు.

తన తండ్రిని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి రావడం మంచిదేనని... అయితే ఆ సమయంలో ఫొటోలు దిగే పరిస్థితిలో తన తల్లిదండ్రులు లేరని చెప్పారు. ఫొటోగ్రాఫర్ ను గది నుంచి పంపించేయాలని తన తల్లి పట్టుబట్టినప్పటికీ ఆయన పట్టించుకోలేదని... తన తల్లి చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి డెంగ్యూతో బాధపడుతున్నారని... ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
Manmohan Singh
AIIMS
Union Health Minister

More Telugu News