Asaduddin Owaisi: ముస్లింల జనాభా తగ్గుతోంది.. మోహన్ భగవత్ సగం అబద్ధాలు చెప్పారు: ఒవైసీ
- జనాభా అసమతుల్యత సమస్యగా మారిందన్న భగవత్
- ముస్లిం జనాభా పెరగడం లేదన్న ఒవైసీ
- కశ్మీర్ లో పౌర హత్యలు పెరిగాయని వ్యాఖ్య
మన దేశంలో జనాభా అసమతుల్యత పెద్ద సమస్యగా మారిందని... దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. విజయదశమి సందర్భంగా చేసిన ప్రసంగంలో మోహన్ భగవత్ అబద్ధాలు చెప్పారని ఆయన విమర్శించారు. సగం సత్యాలు, సగం అసత్యాలు చెప్పారని దుయ్యబట్టారు.
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లో కూడా నిజం లేదని తెలిపారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల అక్కడి ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారంటూ మోహన్ భగవత్ చెప్పిన మాటల్లో నిజం లేదని అన్నారు. కశ్మీర్ లో ఎన్నో పౌర హత్యలు జరిగాయని, ఇంటర్నెట్ షట్ డౌన్లు, సామూహిక నిర్బంధాలు సర్వసాధారణమయ్యాయని విమర్శించారు.