Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు డెంగీ
- ఇటీవల అస్వస్థతకు గురైన మన్మోహన్
- ఎయిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు
- వైద్య పరీక్షల్లో డెంగీ నిర్ధారణ
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
కొన్నిరోజుల కిందట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (89) అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించడం తెలిసిందే. ఆయన జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్ అనారోగ్యానికి కారణం వెల్లడైంది. ఆయన డెంగీతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు వివరించారు. మన్మోహన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో ఎయిమ్స్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు. కాగా, ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మన్మోహన్ ను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పరామర్శించారు.